Sunday, January 2, 2011
జ్ఞాపకాలన్నీ తడిచిపోయాయి...
ఏ స్మృతి కెరటమో
నా మనసుని
దభీలున తాకింది
మనసు పొరల్లోని
జ్ఞాపకాలన్నీ తడిచిపోయాయి.
జాగ్రత్తగా వాటిని
ఆరబెట్టుకుంటుంటే
ఆ తలపుల్లోంచి
నీ స్నేహ సుగంధం
గుప్పున తాకింది నన్ను.
పదిలంగా
నీ స్మృతుల దొంతరల్ని
ఏరి తెచ్చుకుని
ఓ మూల చేరాను...
మరలా నీతో గడపాలనిపించి...!
ఒక్కొక్కటిగా
బయటకు తీస్తున్నకొద్దీ
నీ గురుతుల మైమరపు
ఈ లోకాన్ని మరిపించింది.
నా చుట్టూ అంతా ఉన్నారు.
కానీ- నేను ఏకాంతంలో ఉన్నాను.
అంతా నన్నే చూస్తున్నారు.
కానీ- నన్ను చేరలేకపోతున్నారు.
కాదు... కాదు..
నేనే- నా చుట్టూ
ముళ్ళకంచె వేసుకున్నాను...
వాళ్ళెవ్వరూ నన్ను చేరకుండా...!
ఇదేమిటి..
నా కళ్ళు తడిబారాయి.
తడిచింది మనసు కదా...!
మనసు తడి కనులకూ పాకిందా..?
అదేమిటి..
ఆ తడి పొరలమీద
ఎవరివా అడుగులు..?
ఎవరు రాగలరు నా వైపు
నువ్వు తప్ప...!
ఎదలోతుల్లో బద్రంగా
పదిలపర్చుకున్న జ్ఞాపకాల్లో మాత్రమే
నిన్ను చూడగలననుకున్నాను.
ఇప్పుడిలా...
నా కోసం చేతులు చాస్తూ
కేవలం నా కోసం
మనసు తలుపుల్ని
తీసుకుని వస్తున్నావా...!
ముళ్ళకంచెల అడ్డుగోడల్ని
తోసుకుని వస్తున్నావా నేస్తం...!!
ఎప్పటిదాకా ఎదురు చూడను...
కాలం కన్నీని ని ఆపగలదా..