ఎంత కఠినమైనది ఈ కాలం!!!
నీకు దూరంగా ఉన్నప్పుడు...
కాస్త వేగంగా పరిగెత్తమని, నా నిరీక్షణకి తెర దించమని...
తనను ఎంతలా వేడుకుంటానో??
కానీ నా ఆరాటాన్ని కాస్తైనా అర్థం చేసుకోని కాలం..
క్షణాలని గడియలుగా పొడిగిస్తూ... సమయాన్ని సాగదీస్తూ..
వయ్యారాలు ఒలికిస్తూ... నెమ్మదిగా నడుస్తుంది!
ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని..నా మనసు పడే ఆరాటం తనకు కనిపించదా??
ఎంత నిర్దాక్షిణ్యమైనది ఈ కాలం??
నీతో కలిసి ఉన్న సమయాన...
అదే వయ్యారంతో నెమ్మదిగా నడవమని... కాసేపైనా ఆగిపొమ్మని...
తనను ఎంతలా ప్రార్థిస్తానో??
కానీ నా ఆవేదనని కాస్తైనా అర్థం చేసుకోని కాలం
గడియలని క్షణాల్లా హరించివేస్తూ..
ఎక్కడలేని హడావిడితో వడివడిగా పరిగెత్తుతుంది!
వీడలేక వీడలేక నిన్ను విడిచి వెళ్ళాల్సిన తరుణంలో..నా మనసు పడే వేదన తనకు వినిపించదా?
ఎంత చిత్రమైనది ఈ కాలం?
తన మాయాజాలం అర్థం కాక అసహాయంగా చూస్తున్న నన్ను ఊరడించడానికి
నీ ఙ్నాపకాల ప్రవాహంలో నన్ను ముంచెత్తుతుంది..
అందమైన నీ ఊహల జడిలో నన్ను ఎగరేస్తుంది..
ఈ సందడిలో నా మనసు కాలాన్నే మరిచేలా చేస్తుంది!
కానీ నిన్ను చేరుకునేంత వరకు మనిద్దరి మధ్య దూరం తనే అని..ప్రతి క్షణం గుర్తు చేస్తుంది!
తనకి తెలుసో లేదో?
మన మనసులు ఈ దూరాన్ని ఎప్పుడో చెరిపేసాయని...కాలాన్ని కూడా గెలిచేసాయని!