Sunday, July 1, 2012
ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న దివ్వెలా నీ జ్ఞాపకాన్ని చూశాను
నా ఆలోచనలు గూడులేని గువ్వల్లాగా అనంతమైన ఆకాశంలోకి అంగలార్చినప్పుడు... పనీపాటా లేని దివారాత్రాలు చీకటిలో, వెలుతురులో కొట్టుకుపోయినప్పుడు...దూరంగా నీ ముఖాన్ని చూశాను. ఆ వెలుగులో నా హృదయం లోగొంతుక పాటలగా బద్దలయ్యింది. ఈ వేకువ జామున సూర్యుడి లేత కిరణాలు పూలపైని చెమ్మపై పడగానే అవి మరకతాల్లా మెరిసాయి. సముద్రాలపై ఒంటరిగా తిరిగే పక్షి ఆ పాట అందుకుంది.
.....
నా గొంతు బిగించి ఒక పాట ఎత్తుకోవాలని ఉంది. నిన్ను కలిసిన క్షణాన నాలో కలిగిన ఈ మమైకాన్ని ఒడిసిపట్టుకుని... నా గాత్ర మాధుర్యాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తాను.కిటికీ తెరిచి బయటికి నీకోసం తొంగి చూశాను. దారిపొడవునా నిర్మానుష్యంగా ఉంది. చక్రాల జాడలు వీధి దాటి వెళ్లాయి. అలసిన సూరీడు లేత పసుపు కిరణాల కుబుసాన్ని విడుచుకుంటూ నీలి సాగరంలోకి తనని తాను ఒంపేసుకున్నాడు. ఇంతలోనే పెద్ద నల్లని మేఘమొకటి సూరీడుని కమ్మేసింది. మెల్లగా నేను సముద్రంలాగా సద్దుమణిగి చీకటిలోకి కుంగిపోయాను.
.....
నా లోలోపలి అంచుల్లో ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న దివ్వెలా నీ జ్ఞాపకాన్ని చూశాను. అది ముమ్మాటికీ నీ జ్ఞాపకమే. కాలం పాదాలకింద పడి అదికూడా నలిగిపోతుందేమోనని భయపడ్డాను. పగలు అయిపోతుందంటే నా జీవితమే ముగిసిపోతుందేమోనన్నంత భయమేస్తుంది. సాయంత్రం సముద్రం పక్కన కూర్చున్న గుంపులో ప్రతి ముఖంలో నిన్నే వెదుకుతాను. లోకమంతా కునుకు తీస్తున్న ఘడియల్లో నేను మెలకువను వింటుంటాను. ఇలాంటిదే ఒకరాత్రి ఈ తోటలో మనమిద్దరం కూర్చున్నప్పుడు ఈ తెలియని ముగింపును ఊహించి ఏడ్చాను.
Labels:
కవితలు