మరు జన్మ లో మనసిస్తానని మాటిస్తే మరణాన్నేకోరుకోనా
చిరు చెంప పై చోటిస్తానని తను చెబితే కన్నీటి నై కరిగిపోనా
ఆ కన్నుల అంచుల మాటున కొలువే ఇస్తే కలగానే మిగిలిపోనా
ఆ పెదవుల తోటల పూసే వరమే ఉంటే కథగానే మారిపోనా
మువ్వలా ఆమె కాలికి ముచ్చట నవనా
దివ్వెలా ఆమె దారికి వెలుగును ఇవనా
అలనై పోనా ఆమె నవ్వుల సంద్రాన
శిలనై పోనా ఆమె తాకిన తరుణాన
ఆమె చిన్ని మనసున చిలిపి ఊహను కానా
ఆమె కన్నె సొగసున వలపు పూతై పోనా
మళ్లీ గుర్తుకు వచ్చేందుకు ఆమె తలపున మరుపును కానా
మళ్లీ గెలుపును ఇచ్చేందుకు ఆమె ఆటకు పావును అవనా
మండు వేసవిన ఆమె కోసమే మంచు వర్షమై కురవనా
పండు వెన్నెలను వెండి మబ్బులను ఆమె పాన్పులా పరవనా
ఆమె కొంటె కోపమవనా
ఆమె వంటి మెరుపునవనా
ఆమె బాధను నేను మొయ్యనా
ఆమె అడిగితే ప్రాణ మివ్వనా
అడగను ఆమె కన్నీటిని నా చావున అయినా
కోరను నా కోసం ఆమె చిగురంత స్నేహమైనా
వెతుకుతూనే ఉంటా ఒంటరిగా, చేసేందుకు ఆమె కోసం ఏమైనా
బతుకుతూనే ఉంటా తుమ్మెదలా,ఆమె నవ్వుల పువ్వుల పైన !!