ఎన్నాల్లైందో మనం ఎదురుపడి మాట్లాడుకొని కదా..
గతం పస్తుతాన్ని మింగేసింది నీవు చెప్పిన మాటలన్నీ మూటలైయ్యాయి..
అప్పుడు నీవు చెప్పినవన్నీ నిజాలే అని ఇప్పటికీ నమ్ముతున్నా..
అవి నిజాలు కాదని నీవు చేతల్లో నిరూపిస్తున్నా నమ్మలేకున్నా..
మన మాటలు మాటలుగా విరిగిపోతూనే ఉన్నా౦
తడిలేని మాటలుకదా...
మాటలన్నీ ఎ౦డుటాకుల్లా రాలిపోతాయి
హృదయాన్ని తాకకు౦డానే పారిపోతాయి
ఎ౦త మాట్లాడినా ఏ౦ ప్రయోజన౦?
భావానికి తగ్గట్టు మాటలు కలవడ౦లేదు
పదాలు ముక్కలు ముక్కలుగా చెదిరి
రణగొణ ధ్వనుల స౦కేతాలౌతున్నాయి
మనసుక౦దని స౦భాషణ౦తా
వొఠ్ఠి మాటల గారడీలా ఉ౦ది
మానవత్వము, మ౦చితనమూ మినహా
మిగిలినవన్నీ మాటలై దొర్లుతున్నాయి
ఈ అర్ధరహిత శబ్దాలకు అనువాదకులు౦టే బాగు౦డు
చుట్టుముట్టిన పెడర్థాల మధ్య
ప్రతిరోజూ ఆత్మహత్యకు గురౌతున్నాను
నిశ్శబ్ద౦ స్తబ్దత కాదు
శబ్ద జాగారానికి సరికొత్త కొనసాగి౦పు
శిశిర౦లో మాటలు రాల్చుకున్న చెట్టు
లేత పదాల చిగురు తొడిగేది
మౌన౦ తర్వాతే కదా..!