రాయడం నాకు ఇష్టం
కదిలించగల భావుకత వుందని కాదు
కదిలిన హృదయస్పందనకి అసలైన అక్షరరూపం కోసం
రాయడం నాకు అవసరం
పరిపక్వత నిరూపణ కోసం కాదు
పరిమితులులేని మనసుపయనానికి అక్షరదిక్సూచి కోసం
రాయడం నాకు అలవాటు
ఆలోచనాసరళి మెప్పుదల కోసం కాదు
అభేద్య భావవ్యక్తీకరణ స్వేచ్ఛకి అక్షరసాక్ష్యం కోసం
రాయడం నాకు అభిరుచి
లావణ్యత ఉట్టిపడాలన్న ప్రయత్నం లేదు
లాస్యానుభవ సౌరభాల అక్షరమాల కోసం
రాయడం నాకు ఆనందం
చిందాడే అందమైన పదాల కూర్పుకై కాదు
చిరునగవుని అద్దిన క్షణాల అక్షరసంయోగం కోసం
రాయడం నాకు అమూల్యం
తప్పొప్పుల సమీక్షాసమాహారాల కోసం కాదు
తడబాటులేని విలువల విలువైన అక్షరపాఠం కోసం
రాయడం నాకు స్వార్ధం
నాకవసరంలేని అంగీకారాల కోసం కాదు
నల్లని ఙ్ఞాపకాలు సిరాగా మార్చి, కాగితాలపై అక్షరసమాప్తం చెయ్యడం కోసం
రాయడం నాకు వేదన
కల్లోలసాగర మధింపు వలన కాదు
కలచివేయగల ఆవేదనల అక్షరబద్దత కారణం
రాయడం నాకు అతి ముఖ్యం
ప్రేరేపించడం కోసం కాదు
ప్రేరణ పట్ల అక్షరదీపం ప్రసరింపజేసుకోవడం కోసం
రాయడం నాకు సర్వం
నేనేమిటో తెలుపుకోవడానికి కాదు
నేనేమిటో నేనే మరవకుండా తరచి చూడగల అక్షరసంపుటి కోసం ..