ఆడవాళ్ల మోములో కదలాడే కొన్ని ఎక్స్ ప్రెషన్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. ఓరచూపు, కొంటె నవ్వు, కనీకన్పించక మోముపై విరబూసే చిరు దరహాసం, అదిమిపెట్టుకున్నా బయటపడే సిగ్గు, పెదాల బిగింపులో బంధీ అయ్యే గడుసుదనం, క్షణకాలంలో ప్రత్యక్షమై మరుక్షణమే మాయమయ్యే నిర్లక్ష్యం, చెలికాడి హృదయాన్ని తడిమి చూడడానికి ఎక్కుపెట్టే లోతైన భావాతీతమైన కనుచూపు, కదలికలో మార్పులేకుండానే ఉన్న చోట నుండి నలుదిక్కులూ చుట్టివచ్చే సిక్త్ సెన్స్.. నిజంగా సృష్టికర్త అద్భుత సృష్టి ఆడవాళ్లు నిజమైన ఆనవాళ్లే. మగువ పలికించినన్ని భావాలు మగవాడు వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలవు.
విభిన్నమైన అంశాల పట్ల మగువలకు చాలా నిగూఢమైన అభిప్రాయాలు, ముద్రలు మనోఫలకంపై ముద్రించబడి ఉంటాయి. సందర్భానుసారం అవి కొద్దోగొప్పో వారి హావభావాల ద్వారా వ్యక్తమవుతుంటాయి.. బయటకు వ్యక్తపడని మరెన్నో భావాలు.. అలా అంతర్లీనంగా ఎవరూ స్పృశించడానికి అంతుచిక్కని అద్భుతమైన పార్శ్యాలుగా ఆవిష్కృతం కాకుండా మిగిలిపోతూనే ఉంటాయి. పాపం మగవాడు బయటకు వ్యక్తమయ్యే ఆ కొద్దిపాటి భావాలతోనే మగువ మనసు లోతుని అంచనా వెయ్యాలని ఆపసోపాలు పడతాడు.
కొందరైతే సముద్రం లాంటి మగువ మనసు నుండి బయటకు తొంగిచూసే ఆ కొద్దిపాటి భావాలను సైతం ఒడిసిపట్టే నైపుణ్యత లేక.. అద్భుతమైన మగువ మనసు యొక్క మొదటి పుటనే చదవలేక మొండిగా జీవిస్తుంటారు. తనని గెలుచుకున్న మగవాడికి బంధీ అయి అతని రక్షణలో సేదదీరాలని మగువ మనసు ఉవ్విళ్లూరుతుంటుంది.. కానీ మగవాడు తాను గెలుచుకున్న వనితని కట్టు బానిసని చెయ్యాలని చూస్తుంటాడు. నిలువెల్లా ప్రేమతో తనను తాను అర్పించుకున్న మగువ మనసు లోతులను తడిమిచూసే నైపుణ్యత లేక.. మగువ తనని తాను మరిచిపోయి మగవాడి సాన్నిహిత్యంలో సేదదీరే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఆమె మనసులో ప్రేమను పాదుకొల్పవలసింది పోయి భౌతికంగా ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాడు మగవాడు. దీంతో రెండు మనసుల మధ్య పెనవేసుకుపోవలసిన అలౌకికమైన అనుబంధం బిగిసీ బిగియకముందే సన్నగిల్లడం మొదలవుతుంది.
తమ భాగస్వామి మనసు పుటలను చదివి ఒకరికొకరు తన్మయత్వంతో మునిగితేలే అదృష్టం ప్రపంచంలో ఏ కొద్ది జంటలకో ఉంటుంది. మిగిలిన వారంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అది మనసు పై పొరల్లో సున్నితమైన కుటుంబ సంబంధాల కోసం, దాంపత్య సౌఖ్యం కోసం, సామాజిక అవసరాల కోసం ఒక నిర్థిష్టమైన ప్రమాణం వద్ద తమ భావాలను స్థిరీకరించుకుని ఇరువురు భాగస్వాములూ సమన్వయంతో సాగించే ప్రయాణమే. మగువల మనసుల్లో అంతర్లీనంగా ప్రవహించే భావాల ప్రవాహంలో తానూ మునిగితేలుతూ అంతటి అపూర్వమైన ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ ఆ మగువ మనసులో మగవాడూ మమేకం అయినప్పుడే జీవితం అద్భుతమైన ప్రణయకావ్యం అవుతుంది.