ఈ ప్రపంచంలో మనం, మన ఉనికీ ఎప్పుడూ ఒంటరిదే! జీర్ణించుకోవడం కష్టమైనా ఇది కాదనలేని నగ్నసత్యం. ప్రమాదవశాత్తూ మనం ఏ కుటుంబ సమూహంలోకో, స్నేహబృందంలోకో నెట్టివేయబడ్డామే తప్ప అవేమీ శాశ్వతాలు కాదు. ఈ మాటలు చాలామందికి ఆధ్యాత్మిక బోధనల్లా అన్పించొచ్చు. మననీ, మన అంతరంగాన్ని తరిచి చూసుకుంటే సత్యం ఖచ్చితంగా అర్థమవుతుంది. మనిషి ఏ క్షణమైతే తన ఒంటరితనాన్ని ఆస్వాదించడం మొదలుపెడతాడో, అంతర్ముఖుడై తననితాను గమనించుకోవడం మొదలుపెడతాడో ఆ క్షణం నుండే పరిపూర్ణతని సంతరించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ తత్వం నేనెక్కడా చదువుకున్నదీ కాదు, ఎక్కడో విని చిలక పలుకుల్లా వల్లిస్తున్నదీ కాదు.. !! జీవితం గడిచే కొద్దీ నా ఉనికిని ప్రశ్నించుకుంటున్న కొద్దీ, మనుషుల లౌకికమైన ఆరాటాలను ప్రేక్షకుడిగా గమనించే కొద్దీ జీవితంపై పెరుగుతున్న మెరుగైన అవగాహనలో భాగమే ఈ ఆలోచనా పరిణతి! మనం మనుషుల ఆత్మీయ కౌగిళ్ల మధ్యా, కరచాలనాల మధ్యా బ్రతుకు పట్ల భరోసాని వెదుక్కునంత కాలమూ మనల్ని అభద్రత వెన్నంటుతూనే ఉంటుంది.
ఏ బంధమూ మనతోపాటు పెనవేసుకుపోయేది కాదు.. పెనవేసుకున్నట్లే భ్రమింపజేసి అలవోకగా జారుకునే జారుడు బంధనాలే బంధాలన్నీ! బంధాలు మనల్ని పారవశ్యంలో ముంచెత్తుతాయి. ఆ పారవశ్యాన్ని తనివితీరా ఆస్వాదించేలోపే పుటుక్కున తెగిపోతాయి. చివరకు మెదడంతా శూన్యమే మిగులుతుంది. ఆ శూన్యంలో మరో ఆశాదీపం మరో బంధం రూపంలో వెలుగు చూస్తుంది. దాన్ని పట్టుకుని బ్రతుకు పట్ల ఆశని చిగురింపజేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తాం. అదీ మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. దీంతో బ్రతుకు పట్ల విరక్తి పొడజూపుతుంది. ఆ విరక్తినే ఆత్మ సాక్షాత్కారానికి తొలిమెట్టని, మనమూ పరిపూర్ణులమవుతున్నామని మరోమారు మాయలో పడతాం. విరక్తి అనేది ఓ భావావేశపు స్థితి మాత్రమే అన్న ప్రజ్ఞ కోల్పోతాం. బంధాలు తెగిపోవడం వల్ల అక్కసుతో ఒంటరి తనం నుండి ఏర్పడే విరక్తి మనల్ని ముక్తి మార్గాన నిలిపేది కాదు. మనం దేన్నయితే ముక్తి మార్గమని భావిస్తామో దానిలో ముందడుగు వేయాలంటే ఒంటరితనాన్ని అలౌకికంగా ఆస్వాదిస్తూ లౌకిక బంధాల వ్యామోహాలేమీ మనస్సుని చేరకుండా నిశ్చలంగా కాలం గడపగలిగిన క్షణమే మనల్ని మనం ఉన్నతుల్ని చేసుకుంటూ సాగగలం.
ప్రపంచంతోపాటు కదలాడడం, సమూహంలో మిళితమైపోవడం ఒంటరిగా ఉండడానికి ఏమాత్రం అవరోధం కాదు. బంధాలన్నింటికీ బాధ్యతని నెరవేరుస్తూనే అదే క్షణం మానసికంగా ఆ మాయాప్రపంచం నుండి వేరుపడి ఒంటరితనంలో గడపగల నేర్పు అలవర్చుకుంటే బంధనాలూ సురక్షితంగానే ఉంటాయి, అంటీ ముట్టనట్లు ఉంటున్నామని ఎవరి నుండి ఎలాంటి ఫిర్యాదులూ
ఉండవు, ఒక్కమాటలో చెప్పాలంటే చెరగని చిరునవ్వు ప్రపంచాన్ని పలకరిస్తుంటే లోతైన ఆత్మపరిశీలన మనస్సు పుటల్ని శోధిస్తూ సాగిపోతుంటుంది.