ఈ క్షణం నుండి నువ్వు అలా కాదు.. ఇలాగే ఉండాలి" అని మనకు మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో పంతాల కొద్దీనో, జీవన శైలిని మార్చుకోవడం కోసమో నిశ్చయించేసుకుంటూ ఉంటాం. కానీ ఆ నిర్ణయాలు మరుసటిరోజుకి మరుగునపడిపోతాయి. యధాతధంగా మన comfort zoneలో రొటీన్ గా బ్రతికేస్తాం.
ఏదో సంఘటన "నువ్వు మారాలి.." అన్నది మన మనసుకి సూచిస్తుంది. మన మనసు అప్పటికే సర్ధుబాటైన మనుషులతోనూ, పరిస్థితులతోనూ, మనస్థత్వాలతోనూ ఓ harmonyలో సౌఖ్యంగా ఓలలాడుతుంటుంది. ఆకస్మిక మార్పు ఆ సౌఖ్యాన్ని కొంత భంగపరుస్తుందనే చెప్పాలి. అందుకే మనసులో సంఘర్షణ మొదలవుతుంది.
"ఎందుకు ఇలాగే జరగాలి.. నా మానాన నన్ను ప్రశాంతంగా ఉండనీయొచ్చు కదా పరిస్థితులు.. అస్సలు మనుషులు ఎందుకిలా ప్రవర్తిస్తారు.." అనే విముఖత దగ్గర్నుండీ మొదలై.. "సరే చూద్దాం.. నేనూ ఇకపై ఇలాగే ఉంటాను.. పరిస్థితులో, మనుషులో, నేనో అటో ఇటో తేలిపోవాలి" అనే మొండితనం దగ్గర పెదవులు బిగిస్తాం.
ఇలా అది ఏదైనా కావచ్చు.. మన ఆలోచనాపరిధి, పరిమితికి, జీవన శైలికి సంబంధించి ఓ సంఘటన కొద్దిపాటి అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఆ అల్లకల్లోలంలో మానసికంగా ప్రేరేపితమయ్యే వివిధ రసాయనాలు తమ తీవ్రతని చూపించేసి మెల్లగా చల్లారిపోతాయి. వాటి తీవ్రత గాఢంగా ఉన్నప్పుడు.. సౌకర్యవంతంగా ఉన్న స్థితి నుండి అసౌక్యరంగా ఉన్న మానసిక స్థితిలోకి నెట్టబడిన పరిస్థితుల్ని, మనుషుల్ని క్షమించరాని శత్రువులుగా చూస్తాం. తీరా ఆ తీవ్రత చల్లారాక.. మనం ఇంతకుమునుపు సౌకర్యవంతపు స్థితిలోనే కొనసాగే వెసులుబాటు ఉంటే నిశ్చబ్ధంగా మనసు దానిలోనే కొనసాగిపోతుంది. కాదూ.. పరిస్థితులకు తగ్గట్లు మారక తప్పదూ అనుకుంటే సణుక్కుంటూ మెల్లగా కొత్త ఆలోచనా విధానంలోకి మారడానికి సిద్ధమవుతుంది.
అందుకే ఏ మార్పూ మనకు వెంటనే సమ్మతం కాదు.. దాన్ని జీర్ణించుకోలేం. మారక తప్పదనుకుంటేనే మారడానికి ముందుకు వస్తాం. అలా మారాల్సి వస్తే మాత్రం మనసులో ఎంత సంఘర్షణ చెలరేగుతుందో ఆ వ్యక్తికే తెలుస్తుంది తప్ప వేరెవరం ఊహించలేం. మార్పుకి సిద్ధపడేటప్పుడు క్షణక్షణం అభద్రత తొంగిచూస్తుంది. "అలా కొత్తగా మారిపోతే ఇప్పటి సౌకర్యవంతమైన జీవితం ఏమైపోతుందో" అన్న భయమూ.. లేదా "ఇకపై అలా కొత్తగా ప్రవర్తించదలుచుకుంటే ఇప్పటికే ఉన్న బంధాలన్నీ ఒదిలివెళ్లిపోతాయేమో" అన్న ఒంటరితనమూ.. ఎన్నో ఆలోచనలు ముప్పిరిగొని పరోక్షంగా నరకాన్నే చూపిస్తాయి. ఆ నరకం చూశాకే మారిన మనిషి బయటి ప్రపంచానికి కన్పిస్తాడు.