కోటి మాటలు ఇవ్వలేని ఆనందం
అనుభూతి ..ఒక్క నీ చేతి స్పర్శతో కలిగింది
చీకటి కమ్ముకున్న నా బతుకులో
నువ్వు ద్రువతారవై ప్రవేశించావు
నా హృదయం లేగదూడలా పరుగులు తీసింది
వాసంత సమీరంలా వెన్నెల్లో స్నానం చేసింది
నువ్వు రానంత దాకా నాదో లోకం
అక్కడ నేను ఒక్కడినే కన్నీళ్ళతో సహవాసం చేశా
గుండె గోదావరిగా మారింది ..
దుఖపు సముద్రమై నన్ను ముంచెత్తింది
అవును తోడు లేని జీవితం ఎంత విషాదం కదూ
నువ్వు నా పక్కనుంటే చాలు
అప్పుడు ...నేను పరుగులు తీస్తూ ..
నాలో నేనే నవ్వుకుంటూ ..
పొలాల్లో వాన చినుకులను చేతుల్లోకి తీసుకుంటూ
అలాగే ఉండిపోతా ...
నీ పెదవుల మీద మెరిసే ముత్యాల మెరుపులు
నా కళ్ళల్లోని కనుపాపలను ఆత్మీయంగా ముద్దాడుతుంటే
నేను పసిపిల్లాడిలాగా మారిపోతాను
ప్రేమంటే పంచు కోవటమా కానే కాదు
గుండెల్లో దాచుకోవటం
అందమైన అనుభవాలను కలబోసుకోవటం ..
అందుకే ..ఈ నిత్య సమరంలో..సేద దీరే ఒకే ఒక్క స్థలం
చెలి ఆలింగనం ..ఓ నులి వెచ్చని స్పర్శ..."