నా తోడూ కావాలంటూనే
నా నీడ పడకుండా నడుస్తావు
నా జంటవు నీవంటూనే
నా కలల పంటై పండనంటావు
నా యద కోరుకుంటూనే
నా సొదలేవి నిననంటావు
నా సొగసు నీ సొత్తంటూనే
నా వయసు గోడు వద్దంటావు
నా ఊపిరిలో ఊపిరినంటూనే
నా బిగికౌగిలికే రానంటావు
నా కష్టం నీ కష్టమంటూనే
నా సుఖంలో సగం కానంటావు
నా ముంగిట్లో ముగ్గునంటూనే
నా రంగేళివి నువ్వు కాదంటావు
నా తూరుపులో ఉదయమంటూనే
నా వెలుగులేవి నీకొద్దంటావు
నా అందాలు నీకు విందంటూనే
నా చందాలు నీకు చెందవంటావు
నా గానం మురిపిస్తుదంటూనే
నా రాగం నువ్వు కాదంటావు
నా కోరిక కెరటం నువ్వంటూనే
నా ఆశల తీరం చేరనంటావు
నా చరణాలలో సవ్వడినంటూనే
నా పల్లవిలో పదం కానంటావు
నాపయనంలో పదనిసనంటూనే
నా సరిగమలకు సరికానంటావు
నా కవితకు శైలివి నీవంటూనే
నా కలం కదలికలలో లేనంటావు
నా నిన్నును మరి నేనేమనుకోవాలి?
నాకు నువ్వు ఎవరనుకోవాలి ??
- Ramakrishna