Tuesday, December 21, 2010
మరణిస్తున్నాను మన్నించు నేస్తం ...
మరణిస్తున్నాను మన్నించు నేస్తం
శరీరంతో ప్రతీ సారి
మనసుతో ప్రతిక్షణం
నేడు రేపుల మధ్య నలుగుతున్న
నీలి ఘటనా దృశ్యాల మధ్య
ఒంటరిగా
అచేతనంగా.. నవ్వుకుంటూ
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
స్వప్నాలు ఆగిపొతున్నా
కెరటాలు కదలనంటున్నా
ఆదర్శం అణగనంటున్నా
నాకంటూ ఎవ్వరు మిగలనంటున్నా
ఈ మానసిక ప్రయాణం
శబ్ద సమూహాల వద్ద చేరి
ఆత్మసంఘర్షణల మధ్య .. కన్నీటితో
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
ఆనందం కోసమో ..
అనురాగం కోసమో..
సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో
మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక
ఒక్కోసారి తగలబడుతున్న వెలుగు కంటే
కళ్ళు కనిపించనంత చీకటే నాయమనిపిస్తుంటే...
తట్టుకోలేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
జననానికి మరణానికి నడుమ మిగిలేది
ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే..
నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది
ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే..
అందుకే.. దేన్నీ ఆహ్వానించలేక
అలాగని త్యజించలేక
నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!
(Sailaja Mithra) http://telugupoetry.com ...లోనిది