కమనీయమైన నీ రూపాన్ని,
నా కనుపాపలలో దాచి,
కలకాలం కొలువుంచాలనుకున్నాను
కానీ కనిపించని కలయేదో వచ్చి,
నా కన్నీటితో దానిని తీసుకుపోయింది
మధురమయిన క్షణాలను
మరపురాని జ్ఞాపకాలుగా
నా మనసులో ముద్రించాలనుకున్నాను
కానీ మూగబోయిన మది భావం ,
మాటలురాక మౌనంతో వాటిని మోసుకుపోయింది
సరదాసరాగాల నీ స్నేహాన్ని,
సంతోషంతో సాగించాలనుకున్నాను
కానీ కరిగిపోతున్న కాలం ,
ఆ బంధాన్ని గతంగా తుడిచిపెట్టింది
వెక్కిరిస్తుంది ఈ వింతకాలం
నేను ఒంటరినని
తనకు తెలీదేమో మరి…
నీ ప్రాణం నా చెంతనుండగా
నేనెలా ఒంటరినౌతానని
తెలుసుకుంటుందా ఆ విషయం
మనమిద్దరమైనా మన ‘ప్రాణ’స్నేహం ఒకటేనని