Monday, December 13, 2010
ఊహలోంచి యధార్థంలోకి
ఒక ఊహలోంచి యధార్థంలోకి
పయనానికి సమాయత్తమవుతున్న వేళ
ఎన్నెన్ని అనుమానాలో... ఎన్నెన్ని ఆలోచనలో...
మనసును ఎంతగా స్థిరపరచుకొంటున్నా
కమ్ముకొన్న ఆలోచనల దొంతరలెన్నో...
ఊహల్లో ఉండటం ఎంత
హాయిగా ఉంటుంది!
జరుగుతున్న వాస్తవం చేదుగా ఉంటుంది
మనసుని స్థిమితంగా ఉండ నీయదు
ఒక నిజాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నంలో
గతకాలపు గందరగోళాలు
వెనక్కు లాగేస్తున్నాయి.
జీవితం క్షణక్షణంగా సాగే ఆలోచనల
సమాహారం కదా...
ఓ క్షణంలో మెరిసే వెలుగుకు ఆకృతి
కల్పించడానికి పట్టే సమయం
ఎవరికీ తెలీదేమో...!
అందుకే ఓర్పు ఎంతో కావాలి.
ఆటుపోటులకు అలవాటు పడడమూ
అవసరమే!
సమయంతోపాటు స్వచ్ఛతను
తోడు చేసుకోవడం అవసరమే.
వాస్తవచిత్రాలు రూపుదిద్దుకొనేవరకూ
వేచి ఉండటమూ అవసరమే!
ప్రతిదీ కాలమే నిర్నయిస్తుంది
జరగాల్సింది జరిగిపోతుంది..
అయినా ఓర్పుతప్పదు...