ప్రశ్నించే దృఢమైన స్వరమున్నంత మాత్రాన ప్రతీదీ ప్రశ్నించచూడడం సబబైనది కాదు!
కొన్ని ప్రశ్నలు సంధించడానికీ, కొందరిని ప్రశ్నించడానికీ కనీసమర్యాద అవసరం.
వయస్సు వేడే వ్యక్తిత్వమనుకుని భ్రమపడే మానసిక స్థితిలో తరతమ బేధాలు మర్చిపోయి ప్రవర్తించడమూ సరైనది కాదు.
వేడి చల్లారిన వయస్సులో కూడా లాజిక్ నీ, లాపాయింట్లనీ పట్టుకుని దేనికైనా మనవద్ద జవాబు సిద్ధంగా ఉంచుకోవడమే గొప్పని స్థాయీబేధాలూ, వినయ విధేయతలూ గాలికొదిలేయడమూ వ్యక్తిగా మన పతనాన్నే సూచిస్తుంది.
ఎవరి వయస్సేమిటో, ఎవరి మెచ్యూరిటీ లెవల్స్ ఏమిటో గ్రహించకుండా "మాట్లాడడానికి ఓ నోరుంటే ఏదైనా మాట్లాడేయొచ్చు.." అని సాటి మనిషిని గౌరవించాలన్న కనీస సంస్కారాన్ని నేర్పలేని పిల్లల పెంపకాలు జరుగుతున్నాయి.
ఓ మనిషి పట్ల ఎందరికి గౌరవముంటోంది? అస్సలు సాటి మనిషికి మనం కనీస విలువ ఇస్తున్నామా?
ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా.. అన్యాయాలూ, అక్రమాలూ, నేరాలూ, స్కాములూ! ఇన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ మధ్య ఒక మనిషి నిరంతరం అభద్రతకు గురవుతూ పక్క మనిషి తనకెక్కడ అన్యాయం చేస్తాడేమోనని అనుమానంగా, జెలసీతో మరింత దూరం చేసుకుంటున్నారు
ఒక మనిషికి మరో మనిషి ఎప్పుడు దగ్గరవుతారూ...?
1. మొదట ఒకరిపై ఒకరికి నమ్మకం కలగాలి. అది సాధ్యమవుతోందా? మీరు నన్ను నమ్మారే అనుకుందాం. మీరు ఆశించిన దానికి భిన్నంగా ఎప్పుడైనా ఒక సందర్భంలో నేను ప్రవర్తించి ఉంటే నా మీద మీ నమ్మకం పూర్తిగా పోవడం మనుషులను నమ్మడమా? ఇలాంటి నమ్మకాలతో ఎంతకాలం రిలేషన్స్ నిలుస్తాయి? సో మన ఆలోచనలు మరింత మెచ్యూర్డ్ గా ఉండాలి.
2. పక్క మనిషి ఉనికినీ, అభిప్రాయాలనూ గౌరవించాలి! "వీడికే ఉందిలే బోడి లైఫ్.." అని తృణీకారంగా మొదటి చూపులోనే దూరంగా నెట్టేస్తున్నామే మనుషులను! ఇంకా వారి ఉనికికి ఏం విలువ ఇస్తున్నట్లు? ఎవరైనా ఏ అభిప్రాయం చెప్పినా చులకనగా మనసులో ఓ ఫీలింగ్ పడేసుకుంటున్నాం.. మరి ఇతరుల అభిప్రాయాలను గౌరవించనప్పుడు మనుషులు ఎలా దగ్గరవుతారూ?
3. స్నేహభావంతో చూడడం చాలా ముఖ్యం. కానీ ఒక మనిషి మనకు మొదట కన్పిస్తున్నది శత్రువుగానే! ఇంత దృష్టిదోషాన్ని సరిచేసుకోకుంటే ఎవరికి ప్రమాదం?
అందరూ ఆలోచించవలసిన విషయాలు ఇవి. "లైట్ తీసుకుందాం.." అంటూ overlook చేస్తే భవిష్యత్ తరాలు యంత్రాలుగానే మిగులుతాయి మనుషులుగా కాదు.