మదిని మెలిపెడుతున్న తన మాటల ప్రవాహం,
మతిని చెడగొడుతున్న తన జ్ఞాపక సమూహం,
దగ్గరై దూరమాయెను నా చిలిపి చకోరం...
మాటైనా చెప్పకుండెను నా మూగ మయూరం ......
తానులేని ఈ ఒంటరి పయనంలో,
మనసే ప్రత్యర్ధైన ఈ కఠిన సమరంలో,
ప్రయత్నమే లేక నే ఓడిపోతున్న,
మళ్ళీ మళ్ళీ నే ఒంటరినౌతున్న,
తాను గీసిన పరిధిని దాటి విధి ఆడితే
మౌనముద్ర దాల్చిన బ్రహ్మను నిందించలేక,
తను రాసిన జగన్నాటకపు పాత్రలే శ్రుతిమించితే
మూగబోయిన మహావిష్ణువుని మాటైనా అనలేక,
విధి ఆడిన వింత ఆటలో నే పావునయ్యా!
కాంక్షలేని కనులు కలవరపడుతుంటే,
కాంక్షించిన కోర్కెలు కనుమరుగవుతుంటే,
ఊపిరిసలపని ఊసులు ఊగిసలాడుతుంటే,
ఆ కనులవాకిట బంగారు భవిత చితికిపోతుంది.
ఆ చితికిన కోర్కెలనడుమ బతుకు చిద్రమౌతుంది..
ఆ చిద్రమైన ఊసులతోడి ఈ తనువు చితికి తరలిపోతుంది...