ఒకసారి క్షమించి చూడు
నిర్మలమైన ఆకాశమంటి నీ నయనాల్ని కన్నీటి సంద్రాలుగా మార్చినవాళ్ళని ...............
ఆ కన్నీట తడిసిన నీ మనసు మరెన్నో ఆశల పుష్పాలని పూయిస్తుంది
ఒకసారి క్షమించి చూడు
నిలువెత్తు నీ మంచితనాన్ని చేతకానితనమని తలచిన వాళ్ళని ...........
నీ మంచితనమే పెట్టని కోట లా నిన్ను కాపాడుతుంటుంది
ఒకసారి క్షమించి చూడు
నీ అధరాల తోటలో పూసే చిరునవ్వు మొగ్గలని చిదిమేయాలని చూసిన వాళ్ళని .............
నీ హృదయపు లోతుల్లో ఆనందం గుత్తులు గుత్తులు గా విరబూస్తుంది
ఒకసారి క్షమించి చూడు
నీవు చెయ్యని తప్పుల్ని నీ నేరాలని నిరూపించాలనుకునే వాళ్ళని ............
జీవితమంతా సంతోషం గా ఉండే శిక్ష నీకు పడుతుంది
ఒకసారి క్షమించి చూడు
అందమైన నీ లోకాన్ని చిందరవందర చేస్తున్నవాళ్ళని.........
అందరినీ మైమరిపించగల అద్భుత శక్తి నీదవుతుంది
ఒకసారి క్షమించి చూడు
నిన్ను బాధించే వాళ్ళందరినీ ...............
బాధంటే తెలియని బంగారు భవితవ్యం నీదవుతుంది..