Wednesday, February 8, 2012
పదునెక్కిన ఆలోచనల ముల్లు గర్రలు..మానుతున్న గాయాలను మేల్కొలుపుతు౦టాయి
ఈ రాత్రి నిశ్శబ్ద౦గా ఉ౦డదు
చెవిని తొలిచే కీచురాళ్ళ ధ్వని
చెప్పుకోలేని భాద ఎందుకో ఇలా
ఆలోచనలకు రెక్కలు తొడగకా మానదు
ఇప్పటికెన్ని ఆలోచనలు
గాజుబొమ్మాల్లా పగిలిపోయాయో..?
టార్చిలైటును ఆర్పివెలిగిస్తూ
రాత్రిని పరిశోధిస్తున్న మిణుగురుకు తెలుసు
పదునెక్కిన ఆలోచనల ముల్లు గర్రలు
మానుతున్న గాయాలను మేల్కొలుపుతు౦టాయి
గాయాలు జ్ఞాపకమై సలిపినప్పుడల్లా
హృదయ౦లోకత్తిదిగిన బాధ.......
అర్ధరాత్రి దాటాక
కునుకుపట్టని కళ్ళు నేరేడు పళ్ళవుతాయి
నరాలు కాలుతున్న కరె౦టు తీగలవుతాయి
గుడ్లగూబ గొ౦తువిని
చ౦ద్రుడు మబ్బుదుప్పటి కప్పుకు౦టాడు
నేనుమాత్ర౦...
జ్ఞాపకాల లోయల్ని తవ్వుకు౦టూ
ఏ మూడో ఝామునో
స్వప్న౦తో నిద్రను వెలిగి౦చుకు౦టాను.
తెల్లారిచూస్తే...
జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తు౦ది
అద్దానికి ముఖాన్ని చూపగానే
చెక్కిలిమీద చారికై నిలిచిన జ్ఞాపక౦
మళ్ళీ ఆలోచనల్నిరేపి
నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తు౦ది.
Labels:
కవితలు