Wednesday, September 26, 2012
నేను మళ్ళీ మళ్ళీ నీ జ్ఞాపకాల..కలల రాత్రిలో విహరిస్తూనే ఉంటా
అవతల గట్టున
నువ్వూ..
ఇవతల గట్టున
నేనూ..
కన్నెర్ర చేసే కాలం
మనిద్దరి మధ్య
వారధిగా నిలిచింది
ఎన్నేళ్ళుగా నీ కోసం
వేచి ఉన్నానో తెలీదు
కానీ ..నీతో అనుబంధం కోసం
చేయని ప్రయత్నం అంటూ లేదు
బీటలు వారిన హృదయం మీద
నెర్రెలిచ్చిన మనసు మీద
నీ కళ్ళు ముత్యపు చినుకులై
వాలి పోయాయి ..
ఇద్దరం గుండె గదిగా
మారే క్షణం కోసం
ఎన్నో నిద్ర లేని రాత్రులను
గడిపానో తెలీదు
ప్రేమంటే లోకానికి అతీతమైనది
అది మనుషులకు అందనిది
నీ అడుగుల సవ్వడి చేసే చోట
నేను మళ్ళీ మళ్ళీ నీ జ్ఞాపకాల
కలల రాత్రిలో విహరిస్తూనే ఉంటా
బతుకు పయనంలో
నువ్వూ నేనూ ..సంచారంలో
సమిధలైనా ఇంకా ప్రేమతనపు
లోగిళ్ళలో బందీ అయిపోయి
వెతుకుతూనే ఉన్నాం
ఇప్పడు నేనో సంచారిని
నీ కోసం ..నీ సాహచర్యం కోసం
నీ చూపుల కామదనం కోసం
నీ తలపుల వర్షంలో
తడిసి ముద్దై పోవాలని
సంచారం చేస్తున్న యోగిని