మనసు కథ
‘ఎక్స్‌క్యూజ్ మీ’ అని వినిపించడంతో పక్కకు తిరిగి చూశాడు ప్రగత్. ‘పెన్ను ఉందా?’ అని అడిగింది లక్షణ. ప్రగత్ ట్రెయిన్‌లో నిలబడి ఉన్నాడు. తన పక్కనే ఉన్న సీట్లో కూర్చుని ఉంది లక్షణ. ఆశ్చర్యంగానే ‘లేదండీ’ అన్నాడు. ‘ఎందుకు లేదు?’ వెంటనే అడిగింది లక్షణ. ప్రగత్‌కు నవ్వాగలేదు. ‘నేను పేదోణ్ణండీ. పెన్ను కూడా కొనుక్కోలేనంత పేదోణ్ణి’ అని కాస్త కామెడీని జోడించాడు. ‘మీ షర్ట్ బాగుంది. జేబుకు పెన్ను ఉంటే ఇంకా బాగుండేది’ అంది నవ్వుతూ. రెండు నిమిషాల్లో జరిగిన విచివూతమైన పరిచయం తరువాత ఐదో నిమిషం నుంచి ఫ్రెండ్స్ అయిపోయారిద్దరూ. దేశంలోని విషయాలన్నీ మాట్లాడుకున్నారు ఒక్క లవ్ గురించి తప్ప. అరగంట గడిచింది. లక్షణ పక్కనే ప్రగత్‌కు సీటు దొరికింది. గంట గడిచింది. మాటల్లో పడి మరింత క్లోజ్ అయ్యారు. గంటన్నర గడిచింది. లక్షణ దిగాల్సిన స్టేషన్ వచ్చింది. తను భారంగా చెప్పింది ‘బై’ అని.
మౌనంగానే తలూపాడు ప్రగత్. గంటన్నరలో గతమంతా మరిచిపోయేలా చేసిన ఆ అమ్మాయి వెళ్లిపోతుందంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆమెను ఎలా ఆపాలో తెలియని పరిస్థితి. అసలు ఎలా అడగ్గలడు? ఏం చెప్పి ఆపగలడు?
తను లేచింది. ‘బై’ అంది మరోసారి. ఆమె మొహంలో బాధ కనిపిస్తున్నది. కానీ భారంగా కదులుతున్న ఆమె అడుగులు ఏదో ఆశను రేకెత్తిస్తున్నాయి ప్రగత్‌లో. అందుకే ధైర్యం చేసి అడిగాడు ‘మళ్లీ ఎప్పుడు కలవడం?’ అని.
‘ఇదే మా ఊరు. నువ్వెప్పుడొస్తే అప్పుడు కలుస్తా’ సంతోషం నిండిన మొహంతో చెప్పింది లక్షణ.
‘నెక్ట్స్ సండే?’ అడిగాడు.
‘ఓకే’ అంది లక్షణ.
ట్రెయిన్ ఆగింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తప్పలేదు... లక్షణ ట్రెయిన్ దిగింది.
నిస్సహాయుడిలా ఉండిపోయాడు ప్రగత్. ఫ్లాట్‌ఫామ్ మీద నడుస్తున్న ఆమె రెండు అడుగులకోసారి వెనక్కి చూస్తున్నది. కొంచెం దూరం వెళ్లాక ‘ఇట్రా’ అన్నట్టు కళ్లతో సైగ చేశాడు ప్రగత్. ఆశగా వచ్చింది తను.. ‘నీ పేరే చెప్పలేదు. ఊళ్లో దిగి ఏమనడగాలి?’ అన్నాడు.
‘నెక్ట్స్ సండే వస్తావు కదా. అప్పుడు చెప్తాలే’ అంది నవ్వుతూ.
‘మరి నిన్నెలా కలవాలి?’ సందేహంగా అడిగాడు ప్రగత్.
‘నెక్ట్స్ సండే నువ్వొచ్చేసరికి ఇదే బెంచిపై కూర్చుని ఉంటా’ అని స్టేషన్‌లోని బెంచిని చూపించింది లక్షణ.
ట్రెయిన్ హారన్ వినిపించింది. వాళ్లిద్దరి కళ్లల్లో కన్నీటి పొర పేరుకుంటున్నది.
ట్రెయిన్ కదిలింది. వాళ్ల చెక్కిళ్లపై కన్నీటి చుక్కలు!
ఒక ఆదివారం. ట్రెయిన్ వచ్చింది. స్టేషన్‌లో కూర్చున్న లక్షణ కళ్లు అంతా వెతుకుతున్నాయి ఆశగా. కానీ ఏం లాభం..ఇది వందో వారం! ఇప్పటికీ కొండంత ఆశ కనిపిస్తున్నది ఆమె కళ్లల్లో. ఈ రోజూ అంతే! ప్రగత్ రాలేదు.
తను బయలుదేరింది ఇంటికి. స్టేషన్ మాస్టర్ ఎదురుపడి అడిగాడు ‘రెండేళ్లు అయ్యింది. అతడు వస్తాడని నీకింకా నమ్మకం ఉందా?’ అని.
‘బాబాయ్! దేనికోసమైనా ఐదు నిమిషాలు వెయిట్ చేస్తున్నామంటే అది ‘అవసరం’. కొన్ని గంటలు ఎదురుచూస్తున్నామంటే అదొక ‘నమ్మకం’. కొన్ని నెలలు వెయిట్ చేశామంటే అది ‘ఫ్రెండ్‌షిప్’.. కానీ ఎన్నేళ్లయినా, అసలు రాడని తెలిసినా ఎదురు చూడటమే ప్రేమంటే!. నేను అతన్ని ప్రేమిస్తున్నాను బాబాయ్! ఆదివారాలు ఐదు నిమిషాలకోటి గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు’.... తను చెప్పుకుపోతున్నది.