ఏదో రూపేణా మనం ఇతరుల ఆనందానికి కారణం అయితే మనకూ అంతకు రెట్టించిన ఆనందకరమైన పరిస్థితులు మనకు బాగా అవసరం అయినప్పుడు ప్రాప్తిస్తాయి.
ఎలా ప్రవర్తిస్తున్నామో మర్చిపోయి చిన్న మాటతో మరొకరిని గాయపరిచినా... ఆ గాయం ఏదో విధంగా మనల్ని తిరిగి శిక్షిస్తుంది.
నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఏదో కాజువల్ గా రాస్తున్నవి కాదు.. ఓ ఆనందంలో మునిగిన క్షణమూ, ఓ మానసిక గాయంతో కొట్టుమిట్టాడిన క్షణమూ ఆయా పరిస్థితులకు మూలబీజాల్ని చాలా పర్ ఫెక్ట్ గా గుర్తుకు తెచ్చిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో చూశాక కొద్దిమందినైనా ఆలోచనలో పడేస్తుందని రాస్తున్నదిది.
జీవితంలో తారసపడే ప్రతీ మనిషితోనూ "నాకేం వస్తుంది" అన్న కాలిక్యులేషన్లు, "నేను ఫలానా పొజిషన్ లో ఉన్నా కదా.. ఇలానే ప్రవర్తించాలి" అనే బిగింపులతో సంబంధం లేకుండా అరమరికలు లేకుండా ఉండడం వల్ల ఎంత అద్భుతమైన మనుషులు ప్రాకృతిక ధర్మంలో భాగంగా నాకు తారసపడుతున్నారో నేను చెప్పలేను.
వ్యక్తులతో మనం మనస్ఫూర్తిగా ఉంటే వారి నుండీ మనకు అంతటి ఆత్మీయతే లభిస్తుంది. మన బిజీ జీవితాలతో మనం వ్యక్తులకు ఎంత దూరంగా గడుపుతుంటే.. కొన్నాళ్ల తర్వాత అంతటి దూరంలో మనమే చింతిస్తూ నిలబడవలసి వస్తుంది. ఇదీ ఒకింత నాకు అనుభవమైనదే. అందుకే జీవితంలో ఓ వైపుకే ఒరిగిపోవడం.. సమతౌల్యాన్ని పాటించకపోవడం తెలియకపోతే.. కష్టపడుతూ కష్టపడుతూ మనం ఏదో సాధిస్తూ ఎంతో దూరంలో ఉన్నామనుకుంటాం. దూరంలో ఉండేది వాస్తవమే! అయితే కష్టపడుతూ కష్టపడుతూ ప్రపంచానికి అంత దూరంగా జరిగిపోయామన్నది మాత్రం సత్యం.
మనం పారేసుకునే నోళ్లు మనకు నిందల రూపంలోనూ, మానసికంగా మనం చేసే గాయాలు మన మనసుని మెలితిప్పే బాధల రూపంలోనూ వెంటాడడం ఎవరూ తప్పించలేని ధర్మం.
ఒక లక్ష్యం, గమ్యం, సక్రమమైన జీవన విధానం లేని వ్యక్తి.. తన మాటలు, చేతలకు పర్యవసాలు ఆలోచించలేరు. బయటి ప్రపంచంలోనూ, ఇంటర్నెట్ లోనూ ఎంతోమందిని చూస్తుంటాం. ప్రాంతాన్నీ, కులాన్నీ, వృత్తినీ, ప్రవృత్తినీ ఆసరాగా చేసుకుని ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటాం. ఒక్కసారి మన మెదడు ఎంత మనల్ని దిగజార్చేస్తోందో బేరీజు వేసుకుంటే మన మీద మనకే అసహ్యం వేస్తుంది.
ఆ అసహ్యం మాటలా ఉంచితే.. ఇలా ఇతర వ్యక్తులు, సమాజం పట్ల మనం వ్యక్తపరిచే ప్రతీ భావానికీ తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కాచుకుని ఉంటుంది. కొందరు ఆ ప్రతిఫలం దక్కినప్పుడు కారణాలు గ్రహించగలుగుతారు. మరికొందరు విధి తమ పట్ల ఇలా కఠినంగా ఉంటోందేమిటోనని బుర్రలు గోక్కుంటారు.
మనందరం చదువుకున్నదే.. మంచి వాడితో స్నేహం మంచిది అన్నది. దాని అంతరార్థం.. మంచేదో, చెడెదో మనకు తెలియకపోయినా పక్కవాడైనా మనల్ని రక్షిస్తాడన్న సూత్రం.
ఇప్పుడు ఆర్థిక అవసరాలూ, సామాజిక హోదాలూ, ఫేస్ బుక్ ల లాంటి వాటిలో అయితే.. ఎక్కడ వెకిలితనం, ఎక్కడ అది మంచిదైనా చెడ్డదైనా వినోదం ఉంటే ఆయా చోట్ల మన పరిచయాలు ఆగిపోతోంటే.. మన స్నేహాల్లో కొద్దిపాటి మంచి విలువలైనా ఎలా మిగులుతాయి?
ఆ కొద్దిపాటి మంచి విలువలు కూడా లేకపోతే మనం పరోక్షంగా తోటి మనుషుల్ని ఎగతాళి చేస్తూ, పక్కవాడిని మాటలతో గాయపరుస్తూ, ఎదిగే వాడిని దిగజారుస్తూ, శారీరక వైకల్యాల్ని వినోదంగానూ, రాజకీయపు లోపాల్ని కసిదీరా తిట్టుకుంటూ రాక్షసత్వానికి దగ్గర అయిపోతున్నట్లు కాదా?
మనలో రోజురోజుకీ పెరిగిపోతోన్న ఆ రాక్షస ప్రవృత్తి మనల్ని ఏదో రూపంలో శిక్షించకుండా వదిలేస్తుందంటారా?