నిర్లిప్తత కమ్ముకుంటోందా..
గంభీర స్వరాలు అకస్మాత్తుగా మూగబోవడం..
చలాకీగా చేసే పనులన్నింటిపై నిర్లిప్తత ఆవరించి స్థబ్ధంగా నిలిచిపోవడం..
కళ్లెదుట ఏం జరిగినా ప్రేక్షకుల్లా ఉండడమే సౌఖ్యంగా అన్పించేయడం..
ఇలాంటి మానసిక స్థితికి అప్పుడప్పుడు లోనవ్వని మనిషి ఉండరు. అందుకే చాలామంది కళ్లు శూన్యంలో, మనసు నిస్తేజంలో ఉండడం మన గమనింపుకు వస్తూనే ఉంటుంది.
ఉవ్వెత్తున ఎగిసే ప్రతీ అలా ఓ చోట విరిగిపడాల్సిందే! ఆ పడిన చోటి నుండి తిరిగి బలమూ, వేగమూ పుంజుకోవాలంటే కాస్తంత స్థబ్ధత ఆవరించాల్సిందే.
చాలామందికి తెలియని వాస్తవం.. మన ఆలోచనలు ఇదే క్రమంలో ఎగిసిపడతాయీ, కల్లోలం అవుతాయీ, నిర్లిప్తంగా ఆగిపోతాయీ, తిరిగి మరోమారు ఎగిసిపడతాయి.
"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది, కాసేపు నన్నిలా వదిలేయండి" అని చాలామంది నుండి వింటుంటాం. ఎగిసిపడడం, విరిగిపడడం, మళ్లీ బలం పుంజుకోవడం అనే cycle అనేదే లేకుండా ఏ మనిషి ఆలోచనలూ ఉండవు. అంటే ఓ క్షణ కాలమైనా, మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఏక్టివ్ గా పనిచేసుకుంటూ వెళుతున్నా.. మనం గమనించినా గమనించకపోయినా మన మనసు స్ధబ్ధంగా మారకుండా ఆపలేం.
అన్నింటిలోనూ తానే కలివిడిగా ఉండాలనుకునే మనిషి.. ఆ స్ధబ్ధతలో మాత్రం.. ఏ విషయంలోనూ కొద్దిపాటి ఆసక్తినైనా కలిగి ఉండకపోవడం కూడా ఈ మానసిక cycle ఫలితమే. అందుకే మనకు కావలసిన వారు ఉన్న ఫళంగా ఒంటరిగా ఫీలవుతున్నారని అన్పించినప్పుడు, ఆ ఒంటరితనానికి సరైన కారణాలూ కూడా ఏమీ లేవని అర్థమైనప్పుడు వారికి కాసేపు అలా ఒంటరిగా వదిలేయడమే మంచిది..