మీరు తెలివైన ఆశా జీవులా? అయితే ప్రేమకు బద్ధశత్రువులు...ఆ మనిషిమీద నమ్మకం
మిమ్మల్ని ఓ వ్యక్తికి దగ్గర చేసిందా? అయితే మీది ప్రేమ కానేకాదు... నమ్మకం అనే గుమ్మం దాటారా? అయితే మీ ప్రేమకు మీరే పెద్ద ప్రమాదం! అదంతా మోసం నిజమని నమ్మితే మిగిలేది దుక్కమే ..?
ఫ్రెండ్స్.. పైన చెప్పినవి సుత్తికాదు. పరిచయం ప్రేమగా మారి, వైఫల్యం కత్తిలా గాయం చేస్తే నెత్తుటి మరకలతో బయటపడ్డ అభాగ్య ప్రేమికుడిని. అనుభవంతో చెబుతున్న మాటలివి.అందరిలా నేనూ చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నా. రోజులు రోజుల్లాగే గడిచేవి. ఆమె రాక నా జీవిత గడియారంలో గంటల ముల్లుని సెకన్ల ముల్లులా మార్చేసింది. అయినా నేను కలలు కనలేదు. వూహా లోకంలో విహరించనూ లేదు. ఎందుకంటే అప్పటికి నేను కవిని కాదు. కల్మషం లేని మనిషినంతే! ప్రేమంటే తెలియదు. ప్రేమని వెతికే ప్రయత్నమూ చేయలేదు. అందుకేనేమో గుడ్డిగా ప్రేమలో పడ్డా. నేను పడ్డాడని తెలిసి కొందరు మిత్రులు పడి'పోతున్నావ్' అని చేయందించారు. నేను తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికీ నేను తెలివైన ఆశాజీవిని కాదు.
నెలల సమయంలో తనే నా శ్వాస అయ్యింది. తను వదిలే ఉచ్ఛ్వాసం కోసం వేచివేచి కొన్నిసార్లు వూపిరాడేది కాదు. తను ముందుండి దారి చూపేది. నేను వెనకే వెళ్తూ అనుచరుడిగా మారేవాణ్ని. తన మాటలకు తలాడించే పక్క వాయిద్యకారుడిగా మిగిలేవాణ్ని. కానీ ఆ మాటల్లో నేనున్నానో లేదో గమనించలేదు. ఎందుకంటే ఆ అవసరం నాకు రాలేదు. ప్రేమించానంతే. నమ్మానంతే!
ఇప్పుడు తను నా ముందు లేదు, నేను తన వెనకాల లేను. ఆ మాటకొస్తే తను నా దరిదాపుల్లోకే రావడం లేదు. నన్నంతా 'నువ్వు మోసపోయావ్' అంటున్నారు. అది వింటుంటే నవ్వొస్తోంది. తన అందం చూసి ప్రేమించలేదు. ప్రేమించడానికి తనే ఓ కారణం అని నమ్మి ప్రేమించాను. ఆశించడం తెలియని నమ్మకాన్ని ఎవరు మోసం చేయగలరు చెప్పండి! అది అసాధ్యం కూడా. అందుకు ఉదాహరణ అమ్మ ప్రేమే. తనే అమ్మ అనుకున్నాను. కానీ నన్ను బొమ్మలా ఆడిచింది. నేను కలిసి బతకాలని కలలు కంటుంటే తను విడిపోవడానికి కారణాలు వెతికింది. నా చిన్ని ప్రపంచాన్ని ఆమె ముందుంచితే అరక్షణం ఆలోచించకుండా అల్లుకుపోయింది. అందమైన ప్రపంచం సొంతం కాబోతుందని మురిసిపోయా. కానీ నాదైన లోకానికి నేనో జాలి చూపించే జోకర్‌లా మారతానని అస్సలు వూహించలేదు. ఒకప్పుడు నావాళ్ల సందేహాలకు నేను సమాధానాణ్ని. ఇప్పుడు నేనే ఒక జవాబు లేని ప్రశ్నని.
చివరగా ఒక్కమాట. తెలివైన ప్రేమికులారా.. మీ నమ్మకాలు, భ్రమలు శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు అవి మంచు పరదాల్లా తొలగిపోతాయి. అప్పుడు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించిన మనుషులుండరు. మీ నీడతో సహా అన్నీ మిమ్మల్ని చూసి నవ్వుతాయి. ఆ నవ్వుకి మీ సమాధానం అసహాయంగా మీ మొహంపై కదలాడే ఓ నిర్జీవమైన నవ్వు. అందుకే జాగ్రత్తగా ఉండండి. జతను ఎంచుకోవడంలో జాగరూకత వహించండి.
నా వ్యధ మీ మనసుకి హత్తుకునేలా చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను త్యాగాలు చేసి ఓడిన ప్రేమికుడిని కాదు. కాలం కాటుకి బలైన ప్రియుడ్నీ కాదు. ఓ తెలివైన అమ్మాయి మోజులో నా 29 ఏళ్ల వ్యక్తిత్వాన్ని, ఆశల్ని, కలల్ని, కోరికల్ని బలిపెట్టిన బలహీనుడిని. నా నీడకు జాడ కూడా కరువైన నిశిరాత్రిలో ఒంటరిని. పేరు చెప్పుకోలేని నా ప్రియమైన ప్రేమకి శత్రువుని.