. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 25, 2013

కేశవ రెడ్డి గారి "చివరి గుడిసె "

కేశవ రెడ్డి గారి "చివరి గుడిసె "..............

జంతువుల్ని వేటాడి తింటూ బ్రతుకుతారు వాళ్ళు . ఆస్తి పాస్తుల మాట అటుంచి భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవడం కూడా తెలియదు వాళ్ళకి . కొండల్ని పిండి చేసే శారీరక బలం ఉన్నా ,దాని సాయంతో తమకి జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన కూడా లేకుండా బాధల్ని అమాయకంగా ఆహ్వానించే ఓ అట్టడుగు వర్గం వాళ్ళు యానాది వాళ్ళు ( నాకు ఆర్ధమైనంత వరకు ) .

వాళ్ళ వర్గీయులంతా ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి (మణియం ) చేతిలో మోసపోయి గ్రామం వదిలిపోతే మిగిలిపోయిన ఒకే ఒక్క కుటుంబం మన్నుగాడిది . ఆ పేటలో అతనిదే మిగిలి ఉన్నచిట్ట చివరి గుడిసె . అతని జీవితం, ఆ గుడిసె కూడా ఆఖరికి ఎలా అంతమై పోయాయి అన్నది కథాంశం . 

అసలు అది కథ కాదు జీవితం . అవి అక్షరాలు కాదు సజీవంగా తిరుగాడే ఆత్మలు . అవి అసలు రాతలు కాదు .మనసు కళ్ళతో చూడగలిగే అద్భుతమైన భావ చిత్రాలు. 
అందులో విషాదం పరుచుకుని ఉంటుంది . పేజీల్లోని స్థలం సరిపోక మన మనసుల్లోకి కూడా చేరిపోయి కళ్ళలోకి ప్రవహిస్తూ ఉంటుంది . అక్కడ కాసేపు మనం మన అస్తిత్వాన్నికోల్పోతాం. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ లాగే ఆలోచిస్తాం . వాళ్ళు నవ్వితే నవ్వుతాం . ఏడిస్తే ఏడుస్తాం . చిందులేస్తే చిందులేస్తాం . కర్కశమైన విధి రాతలకి, సాటి మనుషుల చేతలకి బలవుతున్న ఆ బడుగు ప్రాణులపై విపరీతమైన జాలి పొంగుకొస్తున్నా , మనసుని మెలి తిప్పేటంత భాధ గా అనిపిస్తోన్నా కథ కి ముగింపు మాత్రం మరోలా కోరుకోము . అది అలాగే జరిగి ఉంటుంది అనుకుంటాం. చెయ్యని దొంగతనం నేరాన్ని మోపి మణియం, మన్నుగాడిని కొట్టి కొట్టి చంపేస్తాడు . పిరికివాడు అయిన మన్నుగాడి కొడుకు చిన్నోడు భయంతో ఉరి వేసుకుని మరణిస్తాడు. చివరికి వాళ్ళ పెంపుడు కుక్క రాజీ కూడా బెంగతో రోగాల పాలై ఊరి వాళ్ళ చేత కొట్టి చంపబడుతుంది 

మామూలు పరిస్థితుల్లో ఇబ్బందికరంగా అనిపించే కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనకి చాలా సహజంగా అనిపిస్తాయి . ఉదాహరణకి మన్నుగాడు రాత్రంతా చేలో ఎలుకల్ని పట్టి , అవి తమ కలుగుల్లో దాచుకున్న వరికంకుల్తో అన్నం వండుకుని, అ ఎలుకల కూరతో పాటుగా తింటూ , కావలివాడు ఇచ్చిన కల్లుని పట్టిస్తూ ,నోటికొచ్చిన పాటల్ని పాడుకుంటూ చిందులేస్తుంటే మనం నిజంగానే ఎంతో ముచ్చట పడతాం . అక్కడ వాడు చేస్తున్న పని ఏమిటి,ఎటువంటిది అని మనం లేశ మాత్రం కూడా ఆలోచించం . అ పని చేస్తూ వాడు పొందే ఆనందాన్ని మాత్రమే మనం కూడా పరిపూర్ణంగా అనుభవిస్తాం . 

పాత్ర కొద్దీ పదార్ధం అన్నట్టు, మనిషి కి ఉన్న పరిజ్ఞానం కొద్దీ వాళ్ళ ఆశలు కలలూ ఉంటాయి . మన్నుగాడికి అమాయకుడైన తన కొడుకు చిన్నోడు , పొలం దున్నడం,ధాన్యం పండించడం , పెళ్లి చేసుకుని పూరింట్లో ( గుడిసె కాదు) కాపురముండటం అనేవి అత్యద్భుతమైన కలలు . ఆ కలల గురించి కావలి వాడితో చెప్పి మళ్ళీ దిష్టి తగులుతుందేమో అని కలవర పడతాడు. ఆ పేద మనసు కనే కలల్లో మనకి ఎంతో కళాత్మకత కనిపిస్తుంది .

కథ లోని ముఖ్యమైన మూడో పాత్ర బైరాగిది . ఆ బైరాగి జీవిత సత్యాన్ని ఒక పాట రూపం లో చెప్తాడు ఆత్మని చేనుతో పోలుస్తాడు 
భార్యా పిల్లల్ని ఆ చేను మీద వాలి గింజలు కొల్లగొట్టే పిచుకలతోనూ, చిలుకల తోనూ పోలుస్తాడు . అలాగే కామ క్రోధాలని నాశనం చేసే ఎలుకలు, ఏదు పందులతోనూ,మోహాన్నీ , భ్రాంతి నీ చేమ కమ్మే పొగమంచు తోనూ , సిరి సంపదలను కొరికి పాడు చేసే కీటకాలతోనూ పోలిక చెబుతాడు 
తన ఆత్మ సంపదని కేవలం భగవంతునికే సమర్పించాలనే కోరికని వెలిబుచ్చే ఆ పాట ఎంతో వేదాంత ధోరణిలో ఉంటుంది .ఆ విధంగా భవ బంధాల్ని తెంచుకుని , రాగ ద్వేషాలకి అతీతంగా బ్రతికే ఆ బైరాగి , ఒకే ఒక్క రోజు పరిచయంతో మన్నుగాడితో అనుబంధం పెంచుకుని, అతనికి జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేక మణియం మీదకి మన్నుగాడి పెంపుడు కుక్కని ఉసిగొల్పి చంపిస్తాడు. 

చివరికి మణియం దురాగతాలకి బలై పోయిన మన్నుగాడు , చిన్నోడి లాగే వారి చిన్ని చివరి గుడిసె కూడా గబ్బిలాలకీ పాములకీ నిలయంగా మారి , గాలివానకి చిన్నాభిన్నమై, మిగిలిఉన్న వెదురు బొంగులు సైతం దురాశ గల మనుషుల చేత తస్కరింపబడి కేశవరెడ్డి గారి భాషలో తమై(హతమై),అంతమై పోతుంది. 

నిజంగా మనసుని కదిలించి కలచివేసే కథ. చివరి పేజీ వరకు విడవకుండా చదివించే అరుదైన అత్యంత విషాదభరితమైన రచన 

భవాని