ఆమె గురించి తప్ప
నేనేదీ వ్రాయలేదు రాయలేను
ఆమెను నను చంపిన ప్రతీసారీ
నా నుండి నేను పుడుతూనే ఉంటాను
పువ్వులు నలిగిపోయిన చోట,
గాజు గది పగిలిపోయిన చోట
తచ్చాడుతూ తడబడుతూ
ఆమె కోసం కవిత్వాన్ని గుండె గాయాలకు
లేపనంగా పూస్తూ ఉంటాను.
ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీలేక
గాయాలను ముద్దాడటమే నేర్చుకున్నా
కాని గాయం అయిన చోట
మళ్ళీ గాయం చేస్తున్న
నిన్నేమనాలో తెలియక ..
నన్ను నేను మల్లీ గాయపర్చుకుంటున్నా
నిశి రాత్రిని నింపుకున్న నింగి సాక్షిగా
ఆమెపై నేను వేడి నిట్టూర్పునై నాలో నేను
కురుస్తుంటే లోలోపల
ఒంటరితనపు మడతలు సరిచేస్తూ
ఆమెతో గడవని క్షణాలను
నాకు గుర్తుకొస్తూనే వున్నాయి
ఓడిపోయాను మనస్సులో
విరిగిన కొమ్మల్లే వాడిపోయాను
మనిద్దరిలో ఇచ్చిపుచ్చుకోవడానికి
మాటలే కరువైనప్పుడు ఒకరిలో ఒకరు నింపుకొవాలని
ఒకరికి ఒకరు తెలియకుండా
గతంలో మునిగిపోతూ
ప్రస్తుతంలో పడని వర్షంలో
తడిచిపోవాలని విఫల ప్రయత్నం చేస్తున్నా
చించేసిన మనసు కాగితాలలో
విరిగిపోయిన మాటలు
కరిగిపోయిన జ్ఞాపకాల సాక్షిగా
ఓడిపోయిన నిజాన్ని
నిబ్బరంగా గుండెల్లో దాచుకొని రోదిస్తున్నా