పచ్చని పచ్చికబయళ్ళు
చల్లని పైరగాలులు
సెలయేటి సవ్వడులు
మంచు బిందువుల తళుకులు
విహంగాల అలాపనలు
కోకిలమ్మ కమ్మని కుహు కుహూ రాగాలు
చిలకమ్మల చిట్టి పొట్టి మాటలు
ప్రేమ పక్షుల కిలకిలలు
హంసలు ఒలకించే హొయలు
మయూరపు నృత్య సోయగాలు
చెవులపిల్లుల చిలిపి చేష్టలు
చిరు జింకల చెంగు చెంగు నాట్యాలు
చిరుఎండను కప్పేస్తూ పయనించే మేఘాలు
మెలమెల్లగా అలముకున్న చీకట్లు..
కలవరపడి చూస్తే నిజమే, కారుచీకట్లు
వెనుతిరిగి చూస్తే, కానరాని దారులు
నిశీధి వేళలో నిశ్శబ్ధ తరంగాలు నడుమ
జాబిలమ్మ కురిపించే పండువెన్నెల కోసమే ఈ నా ఎదురుచూపులు.
ఇంతకీ నేనలా ఎదురుచూస్తున్నది ఏరోజో తెలుసా!
నిండు అమావాశ్యలాంటి నిజజీవితంలో...
కనులు తెరిచి చూస్తే ఇవేమీ కానరావేమీ??
అదిగో... ఒకవైపు
పచ్చికబయళ్ళు బీటలు పడి ఆశగా ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే
మృత జీవుల కళేబరాల మధ్య రాబందులు పైశాచిక నాట్యం చేస్తుంటే
సుడిగాలులు ఇసుక తిన్నెలను తెరలు తెరలుగా మోసుకొస్తుంటే
అల్లంత దూరంలో ఎండమావులు నను దాహార్తి తీర్చుకోమని ఆహ్వానిస్తున్నాయి
మరోవైపు
రణగొణ ధ్వనుల సంగీత సామ్రాజ్యంలో, స్వార్ధపూరిత సమాజం నను పిలుస్తోంది
రక్తం పంచిన బంధాలు తమ భాధ్యత తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాయి
మనసుని చంపుకొని జీవచ్చవంలా యాంత్రిక జీవనం గడుపమని
అందరిలా బంధాలకి బంధీ అయి బతుకుబాట నడువమని
అందరూ వున్న అనాధలా బంధాలకు బంధీనై బతుకుబాటపట్టాలా!
అష్ఠైశ్వర్యాలు కలిగిన నిత్యదరిద్రుడిలా జీవించలా!
పండువెన్నెల కోసం ఎదురుచూస్తూ, నా కలల లోకంలో బతకాలా!
లేక... చిరుదివ్వెనై చిరకాలం మిగిలిపోవాలా!
దారి తెన్ను కానరాక, నే అలుపెరుగక పరిగెడుతుంటే...
కాలం ఐతే కరిగిపొతుంది కానీ, నేను మాత్రం అక్కడే పడి పాకుతున్నా!
ఆశ నిరాశల నా ఈ అంతర్మధనం నుంచి వెలువడే ఈ ప్రశ్నల హాలాహలాన్ని
గొంతుమాటున బిగిసిపెట్టి, నా హ్రుదయాగ్నిని చల్లార్చుతు ..
ఏకాంతమను ముసుగులో ఒంటరిగా ఇంకా నే జీవించే వున్నా..
ఈ జనారణ్యంలో నిర్వీర్యుడినై...