కళ్లెదుట ఓ దృశ్యం కన్పించినప్పుడు.. మన కళ్లు ఆ దృశ్యంలోని కొద్ది ప్రదేశం మీదకే ఫోకస్ అవుతాయి. మిగతా ప్రదేశం కళ్ల ముందున్నా out focus అవుతుంది.
మాటలూ అంతే.. మన చుట్టూ రణగొణ ధ్వనులు విన్పిస్తున్నా మన చెవులు ఎక్కడో తమకు కావలసిన శబ్ధాల ఫ్రీక్వెన్సీలోనే tune అయి వింటుంటాయి.
ఆలోచనలూ అంతే... మనుషుల్ని, సమాజాన్నీ, పరిస్థితుల్నీ చూస్తున్నప్పుడు ప్రవాహంలా ఆలోచనలు వచ్చి పోతూ ఉన్నా.. ఓ విధమైన ఆలోచనలే ఆయా సందర్భాల్లో మనస్సుని ఎక్కువ ఆక్రమించేస్తాయి.
మన జ్ఞానేంద్రియాలన్నీ వివిధ విషయాల్ని స్వీకరించే విధానం చాలా మిస్టీరియస్ గా ఉంటుంది.
ఒక క్షణాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఆ క్షణకాలంలో దృష్టి ద్వారా, శబ్ధం ద్వారా, ఆలోచనల ద్వారా మనలో ఏది ఆవహించాలన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.
ఒక దృశ్యం మనల్ని మనకు తెలియకుండానే ఆకర్షించవచ్చు... ఉన్న ఫళాన కనులు దాన్ని మనస్సులోకి ముద్రించుకోవడానికి ప్రయత్నించనూ వచ్చు. ఆ దృశ్యం మనల్ని ఎందుకు ఆకర్షించిందో లాజిక్ కి అందదు.. గతంలో చూసినవీ, విన్నవీ, ఆలోచనల గ్రహింపులో ఉన్నవి ఆ దృశ్యాన్ని చూడడానికి మనల్ని ప్రేరేపించవచ్చు.
అలాగే శబ్ధమూ అంతే.. ఓ మ్యూజిక్ చాలా బాగా నచ్చుతుంది... తెలీకుండానే ఓ పాటని బాగా ఆస్వాదిస్తూ ఉంటాం. అందులో tune ఏదో గతంలో మనకు బాగా పరిచయమై, బాగా విని ఉండొచ్చు, అది మెదడులో ఎక్కడో జాగ్రత్తగా భద్రపడి.. అదే రకమైన tune మళ్లీ విన్పించేసరికి.. మళ్లీ మళ్లీ వినాలన్న కోరిక ప్రేరేపితం కావచ్చు.
ఒక క్షణ కాలంలో focus అయిన విషయాలే కాదు.. మన దృష్టిలో out focus అయిన విషయాలూ నిశ్శబ్ధంగా మెదడులో అంతగా ప్రాధాన్యత లేని అంశాలుగా చేరిపోతాయి కూడా! అవి ఎంత ప్రధానమైనవి అన్నది ఆ క్షణం మన అనుభూతి, అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఉదా.కు.. ఈ టాపిక్ పై రాయాలని నాకు ఈవెనింగ్ షటిల్ ఆడేటప్పుడు థాట్ వచ్చింది. అలా వచ్చిన థాట్ ని నేను ప్రయారిటైజ్ చేసుకున్నాను. "ఇలా రాయడం అనే పని పూర్తయిన తర్వాత గానీ fulfill అవ్వదు" అన్నంత ముఖ్యమైనదిగా నేను దాన్ని భావించాను కాబట్టే కళ్లెదుట షటిల్ కాక్ ని షాట్ కొడుతూ దాన్ని focusలోకి తీసుకుని కూడా నాకు తెలియకుండానే ఆ క్షణానికి out focus క్రింద మనస్సులో ఏర్పడిన ఇలా రాయాలన్న ఆలోచననీ ప్రయారిటైజ్ చేయగలిగాను.
అంటే మనం అనేక పనులు చేస్తూనే ఉంటాం.. మన దృష్టి ప్రధానంగా ఒకదానిపై ఫోకస్ అవుతుంది. లోపల మాత్రం ఇతర విషయాలపై అంచనాలు, ఆలోచనలు, ప్రణాళికలు వాటంతట అవి కామ్ గా నిర్మితం అయిపోతూనే ఉంటాయి.
ఇలా మన జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా అర్థం చేసుకుంటే.. వంద పనుల్లోనూ విసుక్కునే గందరగోళం మాయమవుతుంది. రణగొణ ధ్వనుల్లోనూ ఆహ్లాదంగా ఉండగలం.