Monday, November 29, 2010
మౌన ముద్ర
కనుల ముందు కొత్త కాంతి..
వేయి దీపాలు ఒక్కసారి వెలిగినట్టు..
కోటి నక్షత్ర మాల ఎదురైనట్టు..
ఈ వెలుగు కోసం చూసిన రోజులు ఏమయ్యాయి..?
ఇప్పుడిలా సిగ్గుతో పక్క చూపులు ప్రవేశించాయేం..!?
ఇన్నాళ్లూ గుంభనంగా గుండె గదిలో దాచుకున్న.......,
చెప్పలేను..
ఏమని చెప్పగలను..?
ఎన్నని చెప్పగలను..?
వాసంత, హేమంత, శరత్, శిశిరాలను..
సంగీత, సాహిత్య, శత వర్ణ చిత్రాలను..
మోదాగ్ర శిఖరాలను, ఖేదాఖాతాలను..
హిమవన్నగాలను.., మహార్ణవాలను..
పదిలంగా దాచుకున్న మనసుని..
చైత్రపు చినుకునే కాదు, వేసవి వెన్నెలనూ ఆనందించే ఈ మనసుని..
అరలు.. తెరలు.. దాటుకుని హృది కవాటాల్ని తెరిచి.. నీ ముందుంచాలని..
ఎన్నెన్ని కలలు కన్నాను.?
మరేంటి..? ఇప్పుడిలా..!!
చిగురించిన వాసంతం నీకు స్వాగతం పలుకుతున్నా..
తలపుల తలుపులు వాటంతటే తెరుచుకున్నా..
ఈ పిచ్చి మనసు..
మౌన ముద్ర దాల్చి..
కనీసం నీ చూపులతో చూపులు కలపలేకపోతోంది..
http://manasupalikey.blogspot.com/ ..( పై కవిత ఈలింక్ బ్లాగులోనిది )