
ఎన్నో బంధాలు మనుషులను, మనసులను ఏకం చేస్తుంటాయి. ప్రతి బంధంలోనూ ప్రేమతోపాటు ఒక్కోసారి స్వార్థం, అవసరం, సందర్భాలు కూడా మిళితమయ్యే ఉంటాయి. కానీ శాశ్వతంగా నిలిచేది మాత్రం అనురాగభరిత వాస్తవ ప్రేమానుబంధమే. ఏ బంధమైనా కలకాలం నిలవాలంటే దాన్ని సరైనవిధంగా ప్రదర్శించగలగడం కొంతైనా అవసరం. ప్రేమకు కొలమానం ఏది? ప్రేమను కొలిచేందుకు తూనికలు, కొలతలు లేవు. ఇక్కడ ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఉందన్న నమ్మకమే కొలమానం. కేవలం యువతీ, యువకుల మధ్య ఉన్నవే ప్రేమలు కాదు. తల్లి దండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, వీరందరి మధ్యవి ప్రేమబంధాలే.ఆశించడం తప్పనిసరి ఆశ లేకుండా ఏ బంధమూ ఉండదు. ఇచ్చి పుచ్చుకోవడమనేది బంధాల్లో సాధారణం. అయితే వీటిలో ఎల్లకాలం ఇచ్చే వారొకరు, పుచ్చు కొనేవారొకరైతే కుదరదు. తాము పొందినదానికి సమానంగా తిరిగి ఇవ్వగలిగినపుడే చాలా బంధాలు సజావుగా సాగుతాయి. ప్రేమబంధాల్లో భావోద్రేకాలు మనసులోని ఏభావమైనా ప్రదర్శించినపుడే అవతలి వారికి అర్థమవుతుంది. వారి పట్ల ఉన్న ప్రేమాభి మానాలు ఎంత గాఢమైనవో బయట పడేంతవరకు అర్థంకాదు. అయితే మనుషులంతా భావాల్ని ఒకే రకంగా ప్రదర్శించలేరు. కొందరు పెద్దగా నవ్వడం, ఆప్యాయంగా స్పర్శించడం,మరికొందరు మన సులో ఎన్నో భావాల అలలు పొంగుతున్నా పైకి మాత్రం తొణకరు బెణకరు.
చిన్న చిరునవ్వుతోనే తమ అంతరంగంలోని ఆనందానుభూతులను ప్రదర్శిస్తారు. ఈ బంధాల్లో ఒకరి పట్ల ఒకరు స్పందించే తీరు ముఖ్యమైనది. ఇవ్వడం పుచ్చుకోవడం సహజమై నపుడు అది ఎప్పుడు, ఎవరె వరు, ఎంతెంత అని లెక్కలు వేస్తే ఈ బంధాలు నిలవడం కష్టం. కానీ ఏదో ఒక రూపంలో స్పందించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవెనుక నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తే ప్రేమ శాశ్వతమవుతుంది.